రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు.టీడీపీలో చేరిన స్వల్పకాలంలోనే అత్యున్నత పదవులను అలంకరించిన ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం…
1969, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి.. రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి.. రాష్ట్రంలో కీలక నేతగా మారిపోయారు.రేవంత్ తన రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ పార్టీ ద్వారా చేశారు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన రేవంత్.. 2005లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ జెడ్పీటీసీగా మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. పదవీకాలం ముగియకుండానే.. 2007లో జెడ్సీటీసీ పదవికి రాజీనామా చేసి.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అలా గెలిచిన రేవంత్ రెండేళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2007లోనే రేవంత్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో తొలిసారిగా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రేవంత్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. తెలంగాణలో టీడీపీ దుకాణం మూతపడిందనుకున్న సందర్భంలో 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలోనే కీలక నేతగా ఎదిగారు. పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడుగా పేరుపొందారు.
అయితే, తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో రేవంత్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేతకు కాకుండా.. ఆయన పీఏకి ఇచ్చి వెళ్లిపోయారు. కాగా, టీడీపీకి రిజైన చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది.ఎల్లుండి ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.