ప్రొ కబడ్డీ ఐదో సీజన్ తుది పోరులో పట్నా పైరేట్స్ విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 54- 38 తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి టైటిల్ సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి 21- 18 ఆధిక్యంతో నిలిచిన పట్నా రెండో భాగంలోనూ అదే జోరు కొనసాగించింది. ఈ సీజన్‌లో 350 రైడింగ్ పాయింట్లు సాధించిన స్టార్ ఆటగాడు ప్రదీప్ నర్వాల్ ఫైనల్ పోరులో 19 రైడ్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు. 19 సార్లు రైడింగ్ వెళ్లిన ప్రదీప్ రెండు పర్యాయాలు ఐదు పాయింట్లు, ఒక సారి మూడు పాయింట్లు సాధించడం గమనార్హం.
మరోవైపు గుజరాత్ జట్టు కూడా తుది వరకు విజయం కోసం పోరాడింది. తొలి అర్థభాగంలో గట్టిపోటీ ఇచ్చిన గుజరాత్ రెండో సగంలో మాత్రం పోరాటం కొనసాగించలేకపోయింది. మరోవైపు పట్నా తరఫున జయదీప్ అత్యధిక ట్యాకెల్ పాయింట్లు సాధించాడు. పాయింట్లు సాధించడంతో మోనూ గోయత్ కూడా తన వంతు సహకారం అందించడంతో పట్నా విజయం సులువైంది. గుజరాత్ తరఫున సచిన్ తన్వర్ 10 పాయింట్లు సాధించాడు. 2016లో జరిగిన రెండు సీజన్లలోనూ పట్నా విజేతగా నిలిచింది.
లీగ్ దశలో అగ్రస్థానం సాధించి క్వాలిఫయర్- 1లో బెంగాల్ వారియర్స్‌ను చిత్తుగా ఓడించి దర్జాగా ఫైనల్ చేరిన గుజరాత్ ఫార్చ్యూన్స్ ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ ఆటగాడు విజయ్ 5 రైడ్ పాయింట్లు, 4 టాకిల్స్ సాధించి ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచాడు. బెస్ట్ డిఫెండర్‌గా పట్నా ఆటగాడు జయదీప్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 26 మ్యాచులాడిన ప్రదీప్ 369 రైడింగ్ పాయింట్లతో బెస్ట్ రైడర్ అవార్డును ప్రదీప్ అందుకున్నాడు. మోస్ట్ వేల్యుబుల్ ప్లేయర్‌గా అవార్డు అందుకున్న ప్రదీప్‌కు రూ.15 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు. అలాగే టోర్నీలో ప్రైజ్‌మనీ కింద విజేతగా నిలిచిన పట్నాకు రూ.3 కోట్లు, రన్నరప్ గుజరాత్‌కు రూ.1.8 కోట్లు అందజేశారు.