తన నగ్నచిత్రాలను విడుదల చేస్తానని అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన సుజాతా రామకృష్ణన్ మరో తెలుగుదేశం నేతపై కూడా ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. నామా నాగేశ్వరరావు అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లను లైంగికంగా వేధించి.. వారిపై బ్లాక్ మెయిలర్ల ముద్రను వేస్తున్నారని సుజాత అంటున్నారు. ఆయన చేతుల్లో అనేక మంది బలైపోతున్నారని.. అందుకే తను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
తను రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసులు నమోదు చేయలేదని సుజాత అన్నారు. చివరకు కోర్టు ఆదేశాలతో కేసు నమోదైందని వ్యాఖ్యానించారు. గత ఎనిమిది నెలలుగా తనను నామా నాగేశ్వరరావు, ఆయన తమ్ముడు సీతయ్యలు వేధిస్తున్నారని సుజాత ఆరోపించారు. అనునిత్యం తను వేధింపులను ఎదుర్కొన్నా అని అన్నారు. ఒక్కోసారి రౌడీ షీటర్ల చేత కాల్ చేయించారని, తన ఇంటిపైకి కూడా అనేక మార్లు నామా రౌడీషీటర్లను పంపించారని ఆమె చెప్పారు.
తను పోలీసులకు ఫిర్యాదు చేశాకా ఒత్తిళ్లు మరింత అధికం అయ్యాయని, కొంతమంది తెలుగుదేశం నేతలు కూడా తనకు ఫోన్ చేసి కేసును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేశారని ఆమె చెప్పారు. అలా ఫోన్ చేసిన వాళ్లలో తెలంగాణ తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఉన్నారని ఆమె చెప్పడం గమనార్హం. మోత్కుపల్లి కూడా కేసును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె అంటున్నారు.
నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరాలని అనుకుంటున్నారని.. ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయొద్దని, అందుకే ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని తనపై ఒత్తిడి వచ్చిందన్నారు. అయితే తను అలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదని ఆమె చెప్పారు.