యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు సెన్సార్ బోర్డు పై ఫైరయ్యారు. గతంలో చందమామ కథలు సినిమాకు జాతీయ అవార్డు వచ్చినపుడు.. అంతకుముందు సినిమా విడుదలైనపుడు సరైన రివ్యూలు ఇవ్వలేదంటూ మీడియా మీద ధ్వజమెత్తిన ప్రవీణ్ తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు మీద విమర్శలు చేశారు.
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తన్న గరుడవేగ మూవీకి సెన్సార్ బోర్డు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు యు బై ఎ సర్టిఫికెట్ ఇవ్వటాన్ని చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు తప్పుబట్టారు. అసలు జనరలైజ్ చేసిన అంశాలను కూడా ఎవరికో ఆపాదించినట్లు భావించి సెన్సార్ బోర్డు కట్స్ విధించడం బాధాకరమని.. ఈ మధ్య సెన్సార్ బోర్డు ప్రతిదానికీ అభ్యంతరాలు చెబుతోందని.. దీంతో ఫిలిం మేకర్ల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ప్రవీణ్ సత్తారు అభిప్రాయపడ్డారు.
గతంలో టి.కృష్ణ గారి సినిమాలున్నాయి. అలాంటి సినిమాలు ఇప్పుడున్న సెన్సర్ ఆఫీసర్స్ అప్పుడు వుండి వుంటే అప్పట్లో తీసేవారే కాదేమో. తీసినా ఆ సినిమాలు సెన్సర్ బోర్డు దాకా వెళ్లి ఆగిపోయేవేమో అని సత్తారు వ్యంగాస్త్రాలు సంధించారు. అసలు జనరలైజ్డ్ విషయాల గురించి మాట్లాడ కూడదంటున్నారు. రాజకీయ నేత గురించి, పోలీస్ ఆఫీసర్ గురించి, ప్రభుత్వ అధికారి గురించి.. వాళ్లు రేప్ చేసినట్లు కూడా సీన్ చెయ్యకూడదట. ఇదెక్కడి లాజిక్కో అర్ధం కావట్లేదని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రశ్నించారు.
అసలు మనం 70-80లలోనే మరింత లిబరల్ గా వున్నామని.. రాను రాను మరింత నాగరికత రావాల్సిందిపోయి.. పౌరుల స్వేచ్ఛకు మరింత భంగం కలగడం శోచనీయమన్నారు. అసలు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కోసం, ఒక పోస్ట్ కోసం కూడా… 10సార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. చైనా, రష్యా లాంటి దేశాల్లో వుండాల్సిన రూల్స్ ఇండియాలో వుంటున్నాయి. మనదేశంలో వుండాల్సినవైతే కాదు. మనం అంతా దీని గురించి ఆలోచించాలని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మండి పడ్డారు.