ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు వీలినమైన నేపథ్యంలో వీటిని చైతన్య, నారాయణసంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది.
ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ తమ విద్యాసంస్థలను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తమను దెబ్బతీసేందుకు గత కొంతకాలంగా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా నారాయణ విద్యాసంస్థలతో కలిసి పని చేస్తున్నామని, ఈ కాలంలో ఎన్నో అవమానాలు భరించామని ఆమె తెలిపారు. ఇంకెన్నో మోసాలను కూడా చూశామని, తమ ఓపిక నశించిందని, ఇకపై నారాయణ విద్యాసంస్థలతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చామని డైరెక్టర్ సుష్మ వెల్లడించారు.
తమ ర్యాంకులను నారాయణవిగా ప్రచారం చేసుకుంటున్నారని, తమ వద్ద చేరిన విద్యార్థులను తమ విద్యార్థులంటారని, తాజాగా మంత్రిగారి సొంత జిల్లాలో తమ విద్యా సంస్థ డైరెక్టర్లపై కేసులు పెట్టి అరెస్టు చేయించారని అన్నారు. అలాగే చైతన్యలో చేరిన ముగ్గురు హైదరాబాదు బాలురను నారాయణ సంస్థలో జాయిన్ చేయిస్తేనే వారిని విడుదల చేస్తామంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులే తమ సంస్థలో ఆ విద్యార్థులను జాయిన్ చేశారని, దానికి సాక్ష్యం కూడా ఉందని ఆమె తెలిపారు.