అతని చేతుల్లో నుంచి బయటపడటానికి చివరి వరకూ ప్రయత్నించిందా మహిళ. ఆమె వల్ల కాలేదు. అతని కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆమె చివరికి తుదిశ్వాస విడిచింది. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపి, ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆమె చున్నీతోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడతను. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరోడీలో చోటు చేసుకుంది. కరోడీకి చెందిన బిమలా వీణా అనే మహిళ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్ఎంగా పనిచేస్తుండేది. ఆమె వయస్సు 32 సంవత్సరాలు. వివాహితురాలు.
ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం కిందట ఆమెకు హిండౌలీకి చెందిన జాలమ్సింగ్ గుర్జర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతని వయస్సు 28 సంవత్సరాలు. తనకంటే నాలుగేళ్లు పెద్ద అయినప్పటికీ.. అతను బిమలాపై కన్నేశాడు.
ఆమెతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఈ క్రమంలో.. జాలమ్ సింగ్ ఆమెను లొంగదీసుకోవడానికి పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్యా తరచూ గొడవలు చెలరేగుతుండేవి.
గురువారం ఉదయం అతను కరోడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో బిమలా తప్ప ఇతర సిబ్బంది ఎవరూ లేరు. మరోసారి ఆసుపత్రిలోనే ఇద్దరి మధ్యా గొడవ చోటు చేసుకుంది. దీనితో ఆగ్రహానికి గురైన జాలమ్ సింగ్.. బిమలా గొంతు నులిమి హతమార్చాడు.
ఆ సమయంలో ఆమె తనను కాపాడాలంటూ కిటికీ నుంచి ఆర్తనాదాలు చేస్తూ కనిపించిందని స్థానికులు చెప్పారు. కొందరు స్థానికులు ఆసుపత్రికి వస్తోన్న విషయాన్ని గమనించిన జాలమ్ సింగ్ ఆమెను చంపేసి, ఆమె చున్నీతోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.