ఏపీ ప్రతిపక్ష నేత వై సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. ఏపీలో దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని తాము అసెంబ్లీ స్పీకర్ కు, శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ లేవని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అనర్హత వేటు పడాల్సిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారని.. ఇంత జరుగుతున్న స్పీకర్ స్పందించడం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుంచి స్పందన రాలేదని తెలిపారు.
అంతేగాక ఏపీలో పరిపాలన అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గడచిన 41 నెలల్లో 1,09,422 కోట్ల రూపాయల అప్పులు చేశారని వెల్లడించారు. శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తున్నారని, సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని లేఖలో రాష్ట్రపతిని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు, అరాచకాలను ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి ఆయన 5 పేజీల లేఖ రాశారు. దీంతో టీడీపీ నాయకుల్లో కొంత భయం పట్టుకున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు.