ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ అనుకోని విధంగా షాకిచ్చింది. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు ఆరునెలలు పైగానే గడుస్తోంది. మండలి నుంచి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన లోకేష్‌కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకూ వినలేదు. ఆరు నెలల నుంచి శాసనసభ సమావేశాలు కాకపోవడంతో లోకేష్ కు ఆ ఛాన్స్ దక్కలేదు. నవంబర్ 10వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు చిన బాబు బాగానే ప్రిపేర్ అవుతున్నారు.
అయితే వైసీపీ శాసనసభను బహిష్కరించడంతో లోకేష్ కొంత డీలా పడ్డారు. ప్రతిపక్షంలో లేకుండా తొలిసారి శాసనసభలో ప్రసంగించడం ఆయనకు ఇబ్బందే మరి. ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు సూటిగా జవాబిచ్చేందుకు సిద్ధమైన లోకేష్‌కు వైసీపీ పరోక్షంగా దెబ్బ కొట్టారు. ప్రతిపక్షం సభలో ఉంటే ఆ కిక్కే వేరు. వారు చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేసి చంద్రబాబు మెప్పు పొందాలన్న లోకేష్ ఆలోచనలకు వైసీపీ గండికొట్టినట్లయింది. ఈ సమావేశాలే కాదు.. పార్టీ మారిన ఆ 20 మందిని సస్పెండ్ చేయకపోతే… శాసనసభలోకి అడుగుపెట్టకబోమని వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 20 మందిని ఇప్పట్లో సస్పెండ్ చేసే అవకాశం లేదు. న్యాయస్థానంలో వివాదం నడుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. సో ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేది కాదు.. దీంతో అసెంబ్లీలో లోకేష్ శాసనసభలో ప్రతిపక్షం ఉండగా ఆయన మాట్లాడే అవకాశం ఇక రానట్లేనని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.