ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు.
జగన్ అధ్యక్షతన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీ శాసనసభను అధికారపక్షం అత్యంత అప్రజాస్వామికంగా నిర్వహిస్తోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగ్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.
ఇక తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా వారిపై బహిష్కరణ వేటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అంతే కాకుండా వైసీపీని వీడి వెళ్లిన వారిని నలుగురు మంత్రులను చేశారని, మేము సమావేశాలకు హాజరై తాము అడిగిన ప్రశ్నలకు వారిచేత సమాధానం చెప్పించుకోవాలా.. అని వైసీపీ ప్రశ్నించింది. స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేశారన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోనే చేస్తామన్నారు.
అయితే పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేస్తే తాము అసెంబ్లీకి హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నర్ కు చెప్పినా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి ఏపీ అసెంబ్లీలో దిక్కులేకుండా పోయిందన్నారు. ఈ సమావేశాలే కాదు… ఇక మిగిలి ఉన్న రెండున్నరేళ్లు కూడా అసెంబ్లీకి హాజరుకాబోమని నిర్ణయించారు. దీంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరుగుతాయి.
ఇక గతంలో ఎన్టీరామారావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిష్కరించిన విషయాన్ని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పి వైసీపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అసెంబ్లీకి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా కక్ష్య పూరిత ధోరణిని అవలంబిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు సర్కార్ శాసనసభను ప్రజాస్వామ్యబద్ధంగా నచ్ అపుడే మేం అసెంబ్లీకి వస్తాం.. లేకుంటే మా నిరసనను వ్యక్తం చేస్తూ హాజరు కాబోమని వైసీపీ నేతలు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఏపీ శాసనసభ స్పీకర్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి.. జాతీయ మీడియాకు కూడా అందజేస్తాం అని తెలియ జేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అసెంబ్లీ వేదికగానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును అందరి దృష్టికీ తీసుకువెళ్తామని తేల్చి చెప్పారు. దీంతో ఏపీలో శాసనసభ ఎంత దారుణంగా పని చేస్తోందో దేశం మొత్తం మీద చర్చనీయాంశం అవుతోందని.. మొత్తం మీద వైసీపీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిందన విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.