శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. అర్చకుల సమస్యలపై శాసనసభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అర్చకులు, సిబ్బంది వేతనాలపై పరిశీలిస్తామన్నారు. అందరూ అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు రాలేదన్నారు. అన్ని దేవాలయాలను పరిగణనలోకి తీసుకోవాలని సభ్యులు కోరినట్లు సీఎం తెలిపారు. మసీదుల్లో ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు సభ్యులతో భేటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొన్ని మసీదుల్లో ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతామని సీఎం తెలిపారు. మన దేశంలో సెక్యూలరిజం ఎంత బలంగా ఉందో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్తో తెలుస్తుందన్నారు.
అర్చకుల సంక్షేమ కోసం కట్టుబడి ఉన్నాం..ఇంద్రకరణ్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని అర్చకుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. అర్చకుల సమస్యలపై ఐదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. అర్చకులతో చర్చలు జరిపాక ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించారని గుర్తు చేశారు.