ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని జగన్ సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే ప్రణాళికలు రచిస్తూ.. సీనియర్ నేతల నుండి సలహాలు స్వీకరిస్తూ.. ముఖ్య నేతలు, కార్యకర్తలను దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ పాదయాత్ర కోసం జగన్ అండ్ టీమ్ మాత్రం అదిరిపోయే ప్రణాళికలతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర పూర్తి స్కెచ్ ఇప్పటికే రెడీ అయ్యింది. ఇక పాదయాత్రకు వైసీపీ సొంత మీడియా సాక్షి కవరేజ్ ఒక్కటే సరిపోదని తెలుసుకున్న జగన్ ఇతర మీడియా సంస్థల కవరేజ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇక అందులో బాగంగానే తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని అన్ని మీడియా సంస్థల అధినేతలు, సీఈఓలు, ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులతో ఇష్ఠాగోష్టి చర్చలు ప్రారంభించారు. దీనివెనుక ఆయన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈనాడు అధినేత రామోజీరావు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి పాదయాత్రకు ఈనాడు ద్వారా మద్దతు ఇవ్వాలని జగన్ కోరారని సమాచారం.
ఇక తాజాగా జగన్ మిగిలిన మీడియా సంస్థల అధినేతలందరిని తన ఇంటికే ఆహ్వానించారు. ఒక్క టీవీ-9 సీఈవో రవిప్రకాష్ మినహా మిగిలిన అన్ని మీడియా సంస్థల అధినేతలు, ఛానెళ్ల అధిపతులు, సీఈవోలు బుధవారం రాత్రి జరిగిన ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఇరవై నాలుగు గంటలు.. జగన్, వైసీపీని నిర్వీర్యం చేసేందుకు.. జగన్‌కు యాంటీగా దిగజారుడు వార్తలు, వ్యతిరేక కథనాలు, నిరంతరం.. వండి వారుస్తోన్న ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మాత్రం జగన్ ఈ సమావేశానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
రాధాకృష్ణ తన మీడియాలో జగన్‌ను, వైసీపీని పదే పదే టార్గెట్‌గా చేసుకుని కథనాలు ప్రచురిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక దీనికి తోడు ఆ సంస్థల్లో బాబు తనయుడు లోకేష్ భారీగా పెట్టుబడులు కూడా పెట్టినట్టు ఒక టాక్ ఉంది. దీంతో రాధాకృష్ణను కలిసినా ఉపయోగం లేదని.. నిర్ణయంతోనే జగన్ ఈ సమావేశానికి ఆయన్ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్.. ఏబీఎన్ రాధాకృష్ణను లైట్ తీసుకున్నారని
విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.