చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్’ ఆన్‌లైన్ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్‌టైమ్) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది.
ఇప్పటికే ‘బ్లూవేల్’ సమస్య గురించి నిపుణుల బృందం పరిశీలన జరుపుతోందని కేంద్రం సుప్రీం కోర్టుకు వివరించింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.
రష్యాలో పుట్టిన ఈ గేమ్ ఇప్పటికే పలువురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. గత కొన్ని నెలల వ్యవధిలో భారత్‌లో ఆరుగురు చిన్నారులు ఈ గేమ్ బారిన పడి ప్రాణాలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మంది మరణించారు. చిన్నారుల మరణాలపై స్పందించిన కేంద్రం ఇప్పటికే ఇంటర్నెట్ దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలకు ఈ లింకులను తొలగించాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు సైతం ‘బ్లూవేల్’ బారిన పడకుండా చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి.
