భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ అధికారులను ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ రాసినట్టు సమాచారం.
ఈ లీవుల్లో అనుష్క సైతం డిసెంబరులో ఎలాంటి షూటింగ్లకూ కాల్షీట్లు ఇవ్వట్లేదట. దీంతో బాలీవుడ్ వర్గాల్లోనూ అనుష్క పెళ్లి ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివరిలో విరాట్ అనుష్కలు పెళ్లి చేసుకోనున్నారని, అందుకే ఇద్దరూ కనీసం నెల రోజుల పాటు తమ రోజువారీ విధులకు దూరం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అనుష్క-కోహ్లీ జంట ఇంకా ఎటువంటి క్లారీటి ఇవ్వలేదు.