ఈ ఏడాది సౌత్ ఇండియాలో బాహుబలి ది కన్‌క్లూజన్ తరువాత అత్యధిక అంచనాలు ఉన్నది.. దాని తరువాత అత్యధిక బిజినెస్ చేసింది స్పైడర్ సినిమానే. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఈ సినిమాని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ మీద జనాలు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను, ఆశలను అందుకోవడంలో స్పైడర్ విఫలమైంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే, స్పైడర్ ఓ మోస్తారు వసూళ్లతో బాక్సీఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలను కూడా తలకిందులయ్యాయి.
కంటెంట్ పరంగా యావరేజ్ అయినప్పటికీ రిజల్ట్స్ చూస్తే డిజాస్టర్ అయింది. స్పైడర్ థియేటరికల్ రన్ కొద్ది రోజుల కిందటే ముగిసింది. స్పైడర్ ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ రూ.62 కోట్లు మాత్రమే. ఈ చిత్రం థియేటరికల్ హక్కులు రూ.120 కోట్లుకు అమ్మడం విశేషం. అంటే బయ్యర్ల పెట్టుబడికి సగానికి సగం నష్టమేనన్నమాట. ఇప్పటి దాకా ఏ తెలుగు సినిమా కూడా 60 కోట్లకు పైగా నష్టం తెచ్చి పెట్టింది లేదు. మహేష్ బాబు నుంచి గతంలో వచ్చిన బ్రహ్మోత్సవం సైతం ఈ స్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టలేదు. తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రం రూ.70 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ మాత్రం 33 కోట్లే. తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్‌గా 48.3 కోట్ల షేర్ రాబట్టింది. తమిళం, మళయాలం వర్షన్‌లు కలిపి ప్రపంచ వ్యాప్తంగా తెచ్చిన షేర్ 14 కోట్లే. తమిళంలో ఈ సినిమా ఇరగాడేస్తుందని వార్తలు కూడా దీన్ని బట్టి తప్పు అని అర్థమవుతోంది. దీనిబట్టే స్పైడర్ ఓవరాల్‌గా ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.