దేశంలో పెద్ద నోట్ల రద్దు చేసిన వచ్చే నెల ఎనిమిదో తేదీకి ఓ యేడాది కానుందని, అందువల్ల ఆ రోజున రూ.500, రూ.1000 నోట్ల వర్ధంతిని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ అమలు అనే జోడుగుళ్లను దేశ ఆర్థిక వ్యవస్థ గుండెల్లో దింపి దాన్ని చంపుతున్నారంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఎవరినీ సంప్రదించకుండా, చర్చలు జరపకుండా, పర్యవసానాల గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా తీసుకున్నారని.. జీఎస్టీ (గబ్బర్ సింగ్ ట్యాక్స్)తో దేశంలో పన్ను భయోత్పాతాన్ని సృష్టించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు పోతున్నాయని.. ఇది మోడీ సృష్టించిన ఉత్పాతం (మోదీ మేడ్ డిజాస్టర్) అని అన్నారు.
ఇకపోతే.. నవంబర్ 8వ తేదీ రూ.500, 1000 నోట్ల వర్ధంతి రోజు. దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీలో 86 శాతం నోట్లను శ్రీ నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తుడిచిపెట్టేసిన రోజు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ రోజు తమ పార్టీ రద్దయిన నోట్ల వర్ధంతిగా పాటిస్తుందన్నారు. వచ్చే నెలలో రూ.500,1000 నోట్ల వర్ధంతి జరుపుకోవాలని ఆయన తెలిపారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై రాహుల్ ధ్వజమెత్తారు. “డాక్టర్ జైట్లీ.. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది” అని ట్వీట్ చేశారు.