Home / SLIDER / 2013లో తెలంగాణ ఏర్పడిందట..!

2013లో తెలంగాణ ఏర్పడిందట..!

మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే బరాజ్! కానీ.. దాన్ని జిల్లాను చేసేశారు! అదొక్కటేకాదు.. సుందిల్ల, కన్నెపల్లి, గోలివాడ, తుక్కాపూర్ అనే జిల్లాలు కూడా ఉన్నాయన్నారు! అక్కడితో ఆగలేదు.. ఆ జిల్లాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనివని సెలవిచ్చారు! ఇక.. తెలంగాణ ఏర్పడింది 2013లోనని చెప్పారు! ఒకచోట అవిభాజ్య తెలంగాణ అని రాశారు! చెప్తే నవ్వుతారుగానీ.. ఫిబ్రవరి నెలలో 30వ తేదీని కూడా సృష్టించారు! ఇవన్నీ ఎవరో ఊసుపోని వ్యక్తుల రాతలుకాదు.. సాక్షాత్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టే ఇస్తూ వెలువరించిన తీర్పులోని వింతలు.. విశేషాలు! మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తే.. అసలు ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకరించలేదనేదాకా వెళ్లింది ఎన్జీటీ తీర్పు! జస్టిస్ జావేద్హ్రీం, జస్టిస్ రంజన్ ఛటర్జీల బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రతిలో అనేక పొరపాట్లు, సాంకేతిక తప్పిదాలను చూసి న్యాయనిపుణులే నిశ్చేష్టులవుతున్నారు. ఒక రాష్ట్రం 36 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న కీలక ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

medigadda-stay1

ఇన్ని పొరపాట్లా?

కాళేశ్వరం పథకానికి వ్యతిరేకంగా కొందరు ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, ఇటీవల తీర్పు వచ్చింది. రెండ్రోజుల క్రితం 28 పేజీల తీర్పు ప్రతి వెలువడింది. ఇందులో 23వ పేజీలో.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులకోసం 2017 ఫిబ్రవరి 30న దరఖాస్తు చేసుకున్నారని రెండు పర్యాయాలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 2013లో ఏర్పడినట్లు 35వ పేరాలో రెండుసార్లు పేర్కొన్నారు. 18వ పేజీలో ఒకచోట రాష్ర్టాన్ని అవిభాజ్య తెలంగాణగా అభివర్ణించారు. అదే పేజీలో మరోచోట.. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టును మేడిగడ్డ, సుందిల్ల, కన్నెపల్లి, గోలివాడ, తుక్కాపూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చే మరో ఏడు జిల్లాల్లో నిర్మించాలని తలపెట్టింది. అని తీర్పులో పేర్కొన్నారు.

medigadda-stayవాస్తవంగా మేడిగడ్డ, సుందిల్ల అనేవి బరాజ్‌లు, ప్రాంతాల పేర్లు. కన్నెపల్లి అనేది ఒక గ్రామం. అక్కడ పంపుహౌజ్ నిర్మిస్తున్నారు. గోలివాడ, తుక్కాపూర్ అనేవి కూడా గ్రామాలే. వాటన్నింటినీ జిల్లాలుగా పేర్కొనడం విచిత్రం. ఒక తీర్పు కాపీలో అక్షరదోషాలుంటే టైప్ చేసే సమయంలో పొరపాటు జరిగి ఉంటుందని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఒక తప్పును పదే పదే ప్రస్తావించడం, ప్రాంతాలను జిల్లాలుగా పేర్కొనడం, పైగా అవి మరో రాష్ర్టానివని చెప్పడం టైపోగా భావించలేమని పలువురు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి విచిత్రమైన తప్పిదాలు ఒక తీర్పు ప్రతిలో ఉండటమంటే.. విచారణ అనేది నిశిత పరిశీలనతోనే జరిగిందా? తీర్పు ప్రతిని క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగానే రూపొందించారా? అనే సందేహాలు సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతాయని అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ వాదనలు పరిగణనలోకి తీసుకున్నారా?

మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నదనే రీతిలో తీర్పులో అభిప్రాయాన్ని వ్యక్తంచేశారని పలువురు నిపుణులు చెప్తున్నారు. 52వ పేరాలో.. మహారాష్ట్రలోని అనేక గ్రామాలు, పెద్ద ఎత్తున అటవీ భూమి ముంపునకు గురవుతాయి అని పేర్కొనడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. మేడిగడ్డవద్ద 100 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణంతో 150.51 ఎకరాలు ముంపునకు గురవుతాయి. కరకట్టలు నిర్మిస్తే ముంపు 56 ఎకరాలకే పరిమితం అవుతుంది. సంయుక్త క్షేత్రస్థాయి సర్వేలో తెలంగాణ, మహారాష్ట్ర ఇంజినీర్ల్లు తేల్చిన ఈ విషయాన్ని వారి సంతకాలతో కూడిన పత్రాలద్వారా తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు సమర్పించింది. అయినా.. అనేక గ్రామాలు, పెద్ద ఎత్తున అటవీ భూములు ముంపునకు గురవుతున్నాయని తీర్పులో పేర్కొనడమంటే తెలంగాణ వాదనలను పరిగణలోనికి తీసుకోలేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందనేది న్యాయ నిపుణుల భావన.

ఢిల్లీ ట్రిబ్యునల్‌లోనే ఎందుకు?

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడు పాత జిల్లాలు.. అంటే 60-70 శాతం రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎన్నోరంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి. వెరసి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రఖ్యాతిని తీసుకొస్తాయి. అది గిట్టని ప్రతిపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్‌పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను అడ్డుకునేందుకు.. చనిపోయిన వారి పేర్లతో కేసులేసి అభాసుపాలైంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ కుట్రదారులకు చుక్కెదురైంది. అయినప్పటికీ ఢిల్లీలోని ఎన్జీటీని ఆశ్రయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి దక్షిణాది రాష్ర్టాలకు చెన్నైలో ఎన్జీటీ ఉంది. మహారాష్ట్రకు పుణెలో ఉంది. తెలంగాణ దక్షిణాది రాష్ట్రమైనందున చెన్నైలోని ట్రిబ్యునల్‌కు వెళ్లాలి.. లేదంటే మహారాష్ట్రతో ముడిపడిన విషయం కనుక పుణె ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ఇవేవీకాకుండా ఢిల్లీలోని ఎన్జీటీని వెళ్లడం వెనుక మతలబేంటన్న చర్చ సాగుతున్నది. నిజానికి ఈ అంశాన్ని ప్రతిస్పందనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ ట్రిబ్యునల్‌కు కూడా సమర్పించింది. దానిని కూడా ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చకు తావిస్తున్నది. ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తెచ్చింది.

పాలమూరుకు ఒకలా? కాళేశ్వరానికి మరోలా?

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనా ఇదే కాంగ్రెస్ పార్టీ చెన్నైలోని ఎన్జీటీని ఆశ్రయించింది. తాగునీటి పథకాలు, పనులకు పర్యావరణ, అటవీ అనుమతులు అవసరంలేదనేది కనీస సూత్రం. అందుకే చెన్నై ట్రిబ్యునల్.. తాగునీటి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చిన తర్వాత సాగునీటికి డిస్ట్రిబ్యూటరీలు, కాల్వల పనులు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పు మేరకు వ్యవహరిస్తున్నది. అయితే పాలమూరు-రంగారెడ్డి కంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తాగునీటి కల్పన అనేది అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తాగునీటికి సంబంధించిన పనులు చేపడుతున్నట్లుగా కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. కానీ ఢిల్లీ ట్రిబ్యునల్ తాగునీటి పనులకు కూడా వెసులుబాటు ఇవ్వలేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పర్యావరణ, అటవీ అనుమతులంటూ ముడిపెట్టింది.

పెద్ద అడ్డంకి కాదు..

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు పెద్ద సమస్యకాదని సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు. ఈ అనుమతులకు కనీస ప్రాతిపదిక అంతర్రాష్ట్ర ఒప్పందం. గతేడాది ఆగస్టులో ఈ విషయంలో చారిత్రాత్మక ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకుంది. ఆ తర్వాత పర్యావరణ అనుమతులకోసం కేంద్రాన్ని కోరడం, టీవోఆర్ (టర్స్ ఆఫ్ రెఫరెన్స్) రావడం జరిగింది. అందుకు అనుగుణంగా పర్యావరణ అధ్యయనానికి కచ్చితంగా ఏడాది సమయం పడుతుంది. ఇందులో తొమ్మిది నెలలు (మూడు సీజన్లలో) అధ్యయనం జరుగాలనేది నిబంధన. ఈ విషయంలో ఏ ప్రభుత్వం కూడా చేసేదేమీ లేదు. అయితే ఈలోగా తాగునీటికి సంబంధించిన పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతున్నది. కానీ రాజకీయ దురుద్దేశంతో వచ్చే అవాంతరాల కారణంగా కొంత సమయం అవరోధం ఏర్పడుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ అడ్డంకులవల్ల ప్రాజెక్టు ఆగకపోయినా.. రైతులకు సత్వరమే ప్రయోజనం అందించాలనే లక్ష్యం కొన్ని నెలలు ఆలస్యమవుతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది.

రాజకీయ దురుద్దేశమేనా!

ఒక సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు సాధారణంగా మూడు నెలల గడువుంటుంది. కాళేశ్వరం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నది. అంటే ఇది 2007లో ప్రారంభమైంది. పదేండ్ల తర్వాత ట్రిబ్యునల్ పోవడం సాంకేతికంగా నిలువదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సర్కారు ఢిల్లీ ట్రిబ్యునల్‌కు స్పష్టంచేసినట్లు తెలిసింది. దానిని కూడా ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వారి వెనుక కాంగ్రెస్ ఉందని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. పిటిషనర్లకు విమాన టికెట్ల కొనుగోలు, హోటల్ బసకు చేసిన చెల్లింపులకు సంబంధించిన కీలక ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలుస్తున్నది. కాళేశ్వరానికి పర్యావరణ, అటవీ అనుమతులు లేవంటూ పరోక్షంగా ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్.. తన హయంలో 2007లో ప్రాణహిత-చేవెళ్ల మొదలుపెట్టినపుడు ఈ అనుమతులన్నీ తీసుకుందా? అని సాగునీటి నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అప్పుడే తీసుకుని ఉంటే తెలంగాణ సర్కారు ఇప్పుడు మళ్లీ తీసుకోవాల్సిన అవసరమెందుకు వచ్చేదని అంటున్నారు. అప్పట్లోనే ఏదైనా రాజకీయ పార్టీ ఇవే అంశాలపై కోర్టును ఆశ్రయించి ఉంటే అంతిమంగా రైతులే నష్టపోయేవారు. కాంగ్రెస్ నాయకులు ఆ మాత్రం సోయి లేకుండా రైతుల నోట్లో కొట్టయినా సరే.. కాళేశ్వరాన్ని అడ్డుకోవాలని కుట్రలు పన్నడమే ఇప్పుడు అన్నదాతల ఆగ్రహానికి కారణమవుతున్నది.

sorce : namasthe telangana

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat