తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించి, మూడేండ్లుగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కే చంద్రశేఖర్‌రావు నిజమైన లౌకికవాది అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . మూడేండ్లుగా శాంతియుత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ శాంతిదూత అవార్డును ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తరఫున డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లల సంక్షేమం కోసం, ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందన్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో 1700 ఆటోలను సబ్సిడీపై పేద డ్రైవర్లకు అందజేశామని, ట్రాఫిక్ చలాన్ల నుంచి మినహాయించామని పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని ఆయన హితవు పలికారు. స్వరాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషికి భారతరత్న ఇచ్చినా తక్కువేమీ కాదన్నారు.