అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి అనర్హుడని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొనడంతో గత జులైలో ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గురువారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. భార్య వైద్యకోసం లండన్‌లో వెళ్లిన నవాజ్ షరీఫ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆయన తరఫున లాయర్ విఙ్ఞప్తిని న్యాయమూర్తి మహ్మద్ బషీర్ తోసిపుచ్చారు. ఈ కేసును నవంబరు 3 కు వాయిదా వేసిన జడ్జ్ తక్షణమే నవాజ్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో షరీఫ్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత నవంబరు 3 లోపు బెయిల్ పొందే అవకాశం ఉందని అతడి అనుచరులు పేర్కొన్నారు.
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నవాజ్ షరీఫ్ కూతురు, ఇద్దరు కొడుకుల పేర్ల మీద రిజిస్టర్ అయిన ఆఫ్‌షోర్ కంపెనీలను ఉపయోగించి లండన్‌లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు 2016లో లీక్ అయిన పనామా పేపర్స్ ద్వారా బయటపడింది. దీంతో నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. దర్యాప్తు తర్వాత సుప్రీం నవాజ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిని చేసి నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యురో(ఎన్‌ఏబీ) ని ఆదేశించింది. సుప్రీం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్యానల్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాజ్ సంపాదనకు.. ఆయన ఆస్తులకు పొంతన కుదరడంలేదని.. కూతురు, అల్లుడు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్‌లోని కంపెనీల డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని న్యాయస్థానం వీరిని దోషులుగా తేల్చింది.