తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరుగనున్నది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరుకావడంతోపాటు ప్రభుత్వపథకాలపై సమర్థంగా మాట్లాడేలా సిద్ధమవ్వాలని సూచించనున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికంటే ముందుగా మధ్యాహ్నం రెండు గంటలకు 67 మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనున్నది.
పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా శ్రేణులను సన్నద్ధం చేయడంపై రాష్ట్ర కమిటీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రతి పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని పర్యవేక్షకుడిగా, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక కార్యదర్శిని పరిశీలకుడిగా సమావేశంలో నియమించి విధులు, బాధ్యతలను వివరించనున్నారు. పార్టీ అనుబంధసంఘాలు, శిక్షణా శిబిరాలు, పార్టీ కార్యాలయ నిర్వహణ బాధ్యతలను ప్రధాన కార్యదర్శులకు అప్పగించనున్నారని తెలిసింది.