ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. సమాచారమందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 43 మంది గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 47 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
మంటల ధాటికి భవనం చాలా వరకూ కుప్పకూలింది. పక్కనే ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.