నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.‘పోలీసులు నదీమ్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై కొడితే కమిలిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వస్తే విషయం తెలుస్తుంది’ అని సనా తల్లి తెలిపారు. కారులో సనా ఇక్బాల్ చేతులు కట్టి ఉన్నట్లు, ఆమె చెవికి ఉన్న రింగులను తెంచి ఉండడంతో చెవి కోసుకుపోయినట్లు ఉందని తెలిపారు. ‘ఆ రోజుకు కొడుకుని తీసుకుని ఉద్యోగానికి వెళ్లిన సనా రాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చింది. నదీమ్ ఆమెను గమనించి కారులో ఇంటికి వచ్చి వాహనాన్ని సనా ముందు ఆపాడు. తనతో పాటు రావాలని ఘర్షణకు దిగాడు. ఇదంతా మేము పైనుంచి చూస్తున్నాం’ అని షాహిన్‌ఖాన్ తెలిపారు. కాగా, ‘నదీమ్ ఘర్షణ భరించలేక కొడుకును ఇంట్లో విడిచిపెట్టి భర్తతో వెళ్లిన గంటలోపే మృతి చెందింది. పథకం ప్రకారమే ఇదంతా జరిగింది ‘ అని కన్నీటిపర్యాంతమయ్యారు. నదీమ్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సనా తల్లి షాహిన్‌ఖాన్ కోరారు.
