ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుండగా బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది.
పాలేరు రోడ్డుప్రమాదంపై మంత్రుల ఆరా..
పాలేరు అలుగు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరా తీశారు. 15 మంది ప్రయాణికులతో పాటు మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్యకు గాయాలయ్యాయి. గాయపడిన వెంకటనర్సయ్య ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ సిబ్బందికి మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. ప్రమాదంపై ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీసు అధికారుల నుంచి మంత్రి తుమ్మల వివరాలు సేకరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.