విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని ఇప్పటికే తనయుడు బాలకృష్ణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఇక మరోవైపు మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మరో చిత్రాన్ని ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జీవిత కథతో మరో చిత్రం తెరకెక్కనుందని సమాచారం.
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు. తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో వాణి విశ్వనాథ్ కూడా భాగస్వామ్యమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ఇలా అందరూ కలిసి ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎంత రచ్చ చేస్తారో అన్న భయం యావత్ అన్న గారి అభిమానుల్లో నెలకొందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.