టాలీవుడ్ పవర్ స్టార్‌గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ అనూహ్యాంగా రాజకీయాల్లోకి దూసుకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతు పల్కిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జనసేన టీం ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే.. భరతమాత సాక్షిగా పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించడం విశేషం. భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. వేద మంత్రాల మధ్య సన్నిహితులు, జనసేన ప్రతినిధులు, అభిమానులతో కలిసి కార్యాలయంలో అడుగుపెట్టారు. తర్వాత ముస్లిం మత పెద్దలతో పాటు సినీనటుడు అలీ పవిత్ర ఖురాన్‌ను పఠించారు. క్రైస్తవ మతపెద్దలు బైబిల్ స్తోత్రాలతో జనసేనను ఆశీర్వదించారు.