ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. జూన్ వరకు కొనసాగనున్న ఈ పాదయాత్ర ముగిసాక.. పాదయాత్ర వెళ్లని దాదాపు 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారు. ఇది మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంటే 2018 చివర వరకూ జగన్ ప్రజల్లోనే దాదాపుగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ పాదయాత్ర, బస్సు యాత్ర ముగిసిన తర్వాత కూడా పార్టీ తరుపున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఏపీలో హీట్ తగ్గకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో వారంలో ఒకరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించారు. ప్రజలకు అండగా ఉంటున్నామన్న భరోసా నియోజకవర్గంలో కల్పించాలని నేతలకు విజ్ఞప్తి చేయనున్నారు.
ఇక అందులో భాగంగానే.. గురువారం జగన్ పార్టీ నేతలందరితో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ నెల26వ తేదీ పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలు కూడా ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకూ ప్రజల్లోనే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేతల సలహాలు కూడా తీసుకోనున్నారు. పాదయాత్ర జరగని ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలను రూపొందించుకున్నారు. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో ఓ కార్యక్రమం జరిగేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం జగన్ సీబీఐ కోర్టు కు హాజరుకావాల్సి ఉండటంతో అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. అన్ని అంశాలపై రేపు జరగనున్న సమావేశంలో జగన్ నేతలతో చర్చించనున్నారు. ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వరకూ ఏపీలో టీడీపీ సర్కార్ పై జగన్ పోరాటాన్ని కొనసాగించాలనుకోవడం మంచి పరిణామమని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.