తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు .టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ “శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కానీ రచ్చకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై మంత్రి మండిపడుతూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది.. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీఏసీ సమావేశంలో చెప్పాలని సూచించారు.
సభలో మాట్లాడటం.. రోడ్ల మీద మాట్లాడుతం అంటే ఏం చేస్తాం. సర్కారు దగ్గర సమాధానం లేదంటే.. రోడ్ల మీద బైఠాయించడంలో అర్థం ఉందన్నారు. ప్రభుత్వం సమాధానం ఇస్తామన్నా వినకుండా ఆందోళన చేయడంలో అర్థం లేదన్నారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో నిన్నటి ప్రకటనతో తేలిపోయిందన్నారు. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించడం అసహన రాజకీయానికి పరాకాష్ట అని మంత్రి పేర్కొన్నారు. రేపు జరగరానిది ఏదైనా జరిగితే దానికి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలన్నారు. అసెంబ్లీలో వాయిస్ లేని వారు.. ఛలో అసెంబ్లీ లాంటివి ప్లాన్ చేస్తారని మంత్రి విమర్శించారు.