– పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసిన సూరత్ నేతన్నలు
– తెలంగాణకి తిరిగి రావాలన్న ముఖ్యమంత్రి పిలుపుకి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన నేతన్నలు
– తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ
ఇతర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుపోయిన నేతన్నలు తిరిగి రాష్ట్రానికి వస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ రంగానికి ఇస్తున్న చేయూత గొప్పగా ఉన్నదన్న సూరత్ నేతన్నలు ఈ రోజు మంత్రి కేటీ రామారావుని బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన నేత కార్మికులంతా తెలంగాణకు తిరిగి రావాలని వారి ఉపాధి అవకాశాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. కేవలం కార్మికులే కాకుండా సూరత్, భివాండి లాంటి పట్టణాల్లో నేత పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారు సైతం తెలంగాణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు మంత్రికి తెలిపారు. గత అరవై సంవత్సరాలు తమ జీవన స్థితిగతుల గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలేదని మొదటిసారిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు తామంతా తెలంగాణకు తిరిగి రావాలని వచ్చే విధంగా మౌలిక వసతుల విస్తరణ, టెక్స్టైల్, హ్యాండ్లూం రంగానికి అధికంగా నిధులు కేటాయించడం ద్వారా చేయూతనిస్తున్న తీరు తమకు కొత్త ఆశలు రేకెత్తిస్తుందని వారు తెలిపారు.
దేశవిదేశాల్లో ఎక్కడున్నా తెలంగాణ బిడ్డల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తనను కలిసిన నేతన్నలతో అన్నారు… ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన నేతన్నలకు త్వరలో ఏర్పాటు కానున్న కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్న వారు తెలంగాణకి తిరిగి వస్తే వారికి పూర్తి స్థాయి సహకారం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు. ఇక్కడికి తరలి వచ్చే ముందే స్థానికంగా ఇక్కడ డిమాండ్ ఉన్న స్థానిక మార్కెట్, వస్త్రాలు శిక్షణ కలిగిన కార్మికుల వంటి అంశాల పైన స్థూలంగా అధ్యయనం చేయాలని వారికి సూచించారు. తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే తెలంగాణ బిడ్డలందరికీ ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.