ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా బైక్‌రైడ్ చేసి స్పూర్తి నింపిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్(32) మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్‌లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు. భర్త అబ్దుల్ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది.
సనా జీవితం ఆద్యంతం సాహసోపేతం.
నిట్టూర్పులకు నిరుత్సాహానికి తావు లేకుండా, నిరాశా నిస్పృహలను దరిచేరనీయకుండా గడిపారామె. చిన్న వయసులోనే చుట్టిముట్టిన కుంగుబాటును అధిగమించారు. ‘ఇక ఇంతేలే..జీవితం’ అనుకున్న నిస్సహాయ పరిస్థితుల్లో నలిగిపోయి ఫినిక్స్‌లా పైకెగిశారు. నగరంలోని టోలిచౌకీకి చెందిన సనా ఇక్బాల్ భౌతికంగా లేకపోయినా ఆమె అందించిన స్ఫూర్తి మాత్రం దేశంలోని అన్ని నగరాల్లో సజీవంగానే ఉంటుంది. ఆమె బైక్‌పై ఒంటరిగా దేశమంతా పయనించారు. 2015 నవంబర్ 23వ తేదీ నుంచి 2016 జూన్ 13వ తేదీ వరకు ఆమె చేసిన సాహసోపేత బైక్ రైడింగ్ ఒక సంచలనం. దేశంలోని 111 నగరాలు, 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో సనా పర్యటించారు. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా స్ఫూర్తిని రగిలించారు. ఆరున్నర నెలల పాటు, 38 వేల కిలోమీటర్ల దూరం సాగిన ఈ మహా యాత్రలో వేలాదిమంది ఆమె అభిమానులయ్యారు.
ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. ‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’ అనే ఒకే ఒక్క నినాదమై సాగించిన యాత్రలో ఆమె వేలాది మందిని స్వయంగా పలికరించారు. ‘నాకు డిప్రెసివ్‌గా ఉందంటూ’ రాత్రి, పగలు తేడా లేకుండా ఆమె మొబైల్ ఫోన్‌కు ఎవరు సందేశాలు పంపించినా వెంటనే అప్రమత్తమయ్యేవారు. స్వతహాగా సైకాలజిస్ట్ అయిన సనా వారితో గంటలతరబడి మాట్లాడి ఆత్మహత్యా పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు తీసుకొచ్చేవారు. ఆమె మాటలు వారిలో ధైర్యాన్ని నింపేవి. ఎంతో ఊరట కలిగించేవి. ‘సనాతో మాట్లాడిన తరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్‌బుక్ పేజీకి పోస్టు చేసేవారు. కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ సందేశాలు కనిపిస్తాయి. సైకాలజీలో ఎంఏ చేసిన సనా పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చారు.
హత్యే అంటున్న సనా తల్లీ….అనుమానంగా ఉంది
సనాది ముమ్మాటికి హత్యేనని ఆమె తల్లి షాహీన్ తెలిపారు. సనా భర్త నదీమ్ కు దూరంగా ఉంటోందని, తన కొడుకు కలసి జీవిస్తోందని ఆమె అన్నారు. సబ, సనా చెల్లెలు మాట్లాడుతూ తెల్లవారు జామున 2.30 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సనా కారు పార్క్ చేస్తూ నాకు కాల్ చేసింది. అప్పటికే ఆమె భర్త నదీం కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కోసమే అతడు వచ్చినట్లు నాకు అర్ధమైంది. ఆ సమయంలో అతనితో గొడవ పడడం మంచిది కాదని, తాను అతనితో కలిసి వెళ్తానని తన కొడుకును, లాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని అక్క నాతో చెప్పింది, నేను అలాగే బాబును తీసుకొని ఇంట్లోకి వచ్చాను. సనా ఆమె భర్తతో కలిసి బయటకు వెళ్లింది. ఉదయం 7 గంటలకు సనా ప్రమాదానికి గురైనట్లు నదీం ఫ్రెండ్ అద్నాన్ వచ్చి చెప్పాడు. ఆసుపత్రికి కెళ్లాం. అక్క తీవ్రంగా గాయపడింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ చెప్పాడు. కానీ నదీం మాత్రం క్షేమంగా కనిపించాడు. నదీం మా అక్కను చంపేశాడని అనుమానంగా ఉంది. గతంలోనూ నదీంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం అని సబ, సనా చెల్లెలు మీడియాకు తెలిపారు.