స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి తారక రామారావు జీవిత కథను తెరకెక్కించడానికి మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అన్న రామారావుపై ఉన్న ప్రేమ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన వారి పాత్రలు లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో ఉంటాయి. లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుకు రెండో భార్యగా రావడం. ఆ తర్వాత అతనిని వదిలి సూట్‌కేసుతో బయటకు రావడం లాంటి యదార్థ సంఘటనలు ఉంటాయి. ఇంకా ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకొన్న ఆసక్తికరమైన సంఘటనలను తెరకెక్కిస్తాం అని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఇందులో నటించడంకోసం లక్ష్మీపార్వతి పాత్రలో నటించాలని ప్రముఖ నటి వాణి విశ్వనాథ్‌ను కోరాం. ఆమెతో సంప్రదింపులు జరుపుతూనే ప్రముఖ తారలు లక్ష్మీరాయ్, పార్వతీ మెల్టన్‌ను కూడా సంప్రందించేందుకు ప్రయత్నిస్తున్నాం అని జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రానికి పేరు ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. ఏ మాత్రం ప్రొడక్షన్ వ్యాల్యూస్ తగ్గకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తాం. ఫొటోగ్రఫీ బాధ్యతలను సుధాకర్‌రెడ్డి నిర్వర్తిస్తారు అని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల్లో పాటలను రికార్డింగ్ చేయనున్నాం. నవంబర్ రెండోవారంలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని ఆయన చెప్పారు. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తిరుపతిలో ప్రారంభిస్తామని కేతిరెడ్డి చెప్పారు. ఈ చిత్రంలో మూడు పాటలు, ఓ హరికథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని 2018 జనవరిలో కచ్చితంగా రిలీజ్ చేయనున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. అన్నపై ప్రేమతో మళ్లీ డైరెక్షన్ అన్న రామారావుగారి మీద అభిమానంతో మళ్లీ 10 ఏళ్ల తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నానని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రముఖ దర్శకులు పీసీరెడ్డి, విజయ నిర్మల, కృష్ణ, రాజశేఖర్, రాజేంద్రసింగ్, మోహన్ గాంధీ, జీ రామ్మోహన్‌రావు వద్ద కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పనిచేశారు.