తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ని తక్షణమే టీడీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాసిన లేఖపై టీడీపీ పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన, ఎల్ రమణకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ కు ఉన్న అధికారాలన్నిటినీ తొలగిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి సంబంధించిన సమావేశాలు రేవంత్ రెడ్డి నిర్వహించరాదని ఆదేశించారు.
పార్టీ తరఫున ఏవైనా సమావేశాలు నిర్వహించాలని భావిస్తే, రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యేగా మాత్రమే భావిస్తూ ఆహ్వానించాలని సూచించారు. ఆయన అధ్యక్షతన ఎలాంటి సమావేశాలనూ అనుమతించేది లేదని, అవి పార్టీ సమావేశాలుగా గుర్తించవద్దని చంద్రబాబు ఆదేశించారు. తాను వచ్చిన తరువాత అన్ని అంశాలనూ పరిశీలిస్తానని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.