పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్ కుంభకోణం నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని, మ్యాచ్ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
‘ఇలాంటి విషయాలను బీసీసీఐ ఎంతమాత్రం ఉపేక్షించదు. అసలు పూర్తిగా ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని వెంటనే తెలుసుకొని సత్వరమే చర్యలు తీసుకుంటాను. బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అని బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీఏవో) కూడా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో బాధ్యులను వదలబోమని సీఏవో చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు.
దేశంలో పాపులర్ అయిన క్రికెట్ క్రీడలో అవినీతిని ఎంతమాత్రం ఉపేక్షించబోనంటూ బీసీసీఐ కఠినమైన నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీంకోర్టు సైతం బీసీఐఐలో ప్రక్షాళన కోసం కీలక చర్యలు తీసుకుంది. మాజీ కాగ్ వినోద్ రాయ్ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటర్స్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో పిచ్‌లో మార్పులకు సిద్ధమంటూ బుకీలకు చెప్పడమే కాకుండా.. బుకీలను మైదానంలోకి స్వయంగా పిచ్‌ను చూపించిన ఎంసీఏ క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్ వ్యవహారం బీసీసీఐలో కలకలం రేపుతోంది. ఈ స్టింగ్ ఆపరేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.