దేశ ప్రజలు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి తమ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని తక్కువ దేశభక్తులుగా ఎలా పరిగణిస్తామని ప్రశ్నించింది.
దేశభక్తి అనేది బలవంతంగా దేశ పౌరుల మీద రుద్దకూడదని స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని వినిపించడానికి సంబంధించి జాతీయ పతాక నియమావళి సవరణపై నిర్ణయాన్ని జనవరి 9న జరిగే తదుపరి విచారణ నాటికి తమకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. న్యూస్ ఏజెన్సీ పిటిఐ రిపోర్ట్ ప్రకారం ఏ.ఎం.ఖాన్వాలికర్, డివై. చంద్రచూడ్ మరియు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ ముగ్గురు సమావేశమై కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా సవరణలు చేయాలని సూచించారు. అటార్నీ జనరల్ కెకె. వేణుగోపాల్ మాట్లాడుతూ భారత దేశం విభిన్న దేశమని, పౌరుల మధ్య సమానత్వంను పెంపొందించడానికి ఈ జాతీయ గీతాన్ని సినిమా హాల్స్‌లో ఆలపించాలని సూచించారు. ఇక మీదట సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపిస్తే తప్పనిసరిగా నిలబడి పాడాల్సిన అవసరం లేదని, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని, వాళ్ళకి ఇష్టం ఉంటే లేచి పాడుతారు లేకుంటే లేదని.. దీనిని నేరంగా పరిగణించాల్సిన పని లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.