నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు .ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ఎంపీ గుత్తా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వ్యవసాయం అంటే తెలియని కోమటిరెడ్డి రైతులపై ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డిని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు చులకన అవుతున్నాయన్నారు. జిల్లాలో 18 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రవాణా భారం కాకుండా జిన్నింగ్ మిల్లులు ఉన్న చోట సీసీఐ కేంద్రాలు తెరిచామని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.