దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ సినిమాలో డైలాగులు ఉన్నాయని బీజేపీ నాయకులు ఇప్పటికే ఆరోపించారు.
ఇప్పుడు మరో వివాదం తెర మీదకు వచ్చింది. మెర్సల్ సినిమాలో హీరో విజయ్ ప్రజలకు కావాల్సింది దేవాలయాలు కాదని, ఆసుపత్రులు అంటూ డైలాగులు చెప్పారు. హిందువులు దేవాలయాల్లో దేవుడిని భక్తితో పూజిస్తారని, అలాంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సినిమాలో డైలాగులు ఉన్నాయని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మదురైలో సోమవారం కేసు పెట్టారు. హిందూ సంఘ, సంస్థకు చెందిన న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారాణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.