ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాదయాత్రకు మినహాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో జగన్ పాదయాత్ర నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. నవంబర్ 3వ తేదీన కోర్టుకు హాజరయిన తర్వాత ఆరో తేదీ నుంచి పాదయాత్ర జరగనుందని వైసీపీ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రాకున్నా నవంబరు 3న శుక్రవారం కావడంతో ఆయన యాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
జగన్ పాదయాత్రకు ముందే అన్ని వర్గాలతో సమావేశాలు జరుపుతున్నారు. రేపు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో జగన్ సమావేశం కానున్నారు. వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పాదయాత్రలో ప్రస్తావించాలని భావిస్తున్నారు. తర్వాత ముఖ్య నేతలతోనూ జగన్ సమావేశమవుతారు. ఈ నెల27వ తేదీన జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందనున్నారు. ఈ నెల26వ తేదీన శాసనసభ పక్ష సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. శాసనసభ పక్ష సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా.. వద్దా.. అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాదయాత్రకు ప్రతి వారం బ్రేకులు పడినా దాని వేడి తగ్గకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో ఆరోజు బహిరంగ సభలు వంటి వాటిని ఏర్పాటు చేసి హీట్ ఎక్కించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మొత్తం మీద జగన్ పాదయాత్రకు బ్రేకులు కల్గకుండా వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్ అనేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.