ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబునాయుడు పనితీరు ముఖ్యంగా సీఎంఓ పై ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఆయన కొంతకాలంగా సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా, రాజకీయ కార్యాలయంగా మారిపోయింది.
దీన్ని సంస్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎంవో పారదర్శకంగా పనిచేసేందుకు ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.
సీఎంవో పనితీరు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ప్రజల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్, ఏపీ బిజినెస్ రూల్స్‌కు సవరణలు చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన ఆ వ్యాజ్యంలో కోరారు. ఈ సవరణలు సీఎంవోకు వర్తింపచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.