టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక్కటి కాబోయే తరుణం వచ్చేసిందని సమాచారం. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని అటు సినీ వర్గీయులు.. ఇటు క్రికెట్ వర్గీయులు కూడా అవుననే అంటున్నాయి. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉందట. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండడంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్న విషయం తెలియరాలేదు.
కోహ్లీ-అనుష్కలు రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. 2013లో జరిగిన ఇంగ్లండ్ టూర్లో అనుష్కతో కలిసి కోహ్లీ కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. అయితే 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్చల్ చేశాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు అనుష్క బహిరంగంగా అతడికి మద్దతు తెలిపింది. ఇటీవల ఇద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇక అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరుష్క వివాహం వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.