పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2017’ను అందుకున్నాడు. రొనాల్డో ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోలింగ్‌లో మెస్సి, నెయ్‌మర్ నుంచి రొనాల్డో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. చివరికి వారిని వెనక్కినెట్టి రొనాల్డో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎన్నికయ్యాడు. 2016లో కూడా ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను రొనాల్డో అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ..‘ముందుగా నాకు ఓటు వేసి గెలిపించిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మెస్సి, నెయ్‌మర్ ఎదుట అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబసభ్యులు, స్నేహితులు, రియల్ మాడ్రిడ్, పోర్చుగీస్ ఎన్‌టీ జట్టు సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, నాకు మద్దతు తెలిపిన అందరికీ ఈ అవార్డు అంకితం.’ అని తెలిపాడు.
ఈ ఏడాది రొనాల్డో ఇప్పటి వరకు క్లబ్, దేశం తరఫున 48 మ్యాచుల్లో 44 గోల్స్ చేశాడు. ఆయన చేసిన గోల్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. జూన్ 3న కార్డిఫ్ మిలీనియం స్టేడియంలో జువెంటిస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో రొనాల్డో రెండు గోల్స్ సాధించాడు. ఈ మ్యాచులో రొనాల్డో జట్టు 4-1తో విజయం సాధించింది.