మైనార్టీలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. కాగా, నిన్న మైనార్టీ సంక్షేమ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కచ్చితంగా మైనార్టీలు లబ్ధిపొందే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. పేద మైనార్టీ యువకులు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వందశాతం సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించాలన్నారు. లక్షా, రెండు లక్షలు, రెండున్నర లక్షల విలువైన యూనిట్ల కోసం ఆర్థిక సాయం అందించాలని, ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పదిశాతం మైనార్టీలకు దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగర పరిధిలో ముస్లింలకు ప్రత్యేక పారిశ్రామికవాడ, ఐటీ కారిడార్ నిర్మిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనార్టీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
