భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇరువురికి చెందిన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే కోహ్లీ విరామం అడిగాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య ఓ వస్త్ర దుకాణ ప్రచార ప్రకటనలో వీరిద్దరూ కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
డిసెంబరు చివరి వారంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందుగానే వివాహం చేసుకోవాలని భావించిన కోహ్లీ శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కోరినట్లు సమాచారం. ‘ఐపీఎల్ నుంచి కోహ్లీ ఇప్పటి వరకు క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంది. రొటేషన్ విధానంలో భాగంగా శ్రీలంకతో టెస్టు సిరీస్ అనంతరం కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాము.’ అని ప్రధాన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు.
Tags anushka sharma Cricket love marrige virat kohli