ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో నిన్నఅర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్ సమీపంలో రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్మెంట్ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వారి వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో కలిసి ఏడాది కిందట బేల్దారి పనులు చేసుకునేందుకు ఒంగోలుకు వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఏం జరిగిందో ఏమో తెలియదు కాని సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఏడుకొండలు తన భార్య అంజలిని అత్యంత కిరాతకంగా రాయితో నుజ్జునుజ్జు చేసిచంపేసాడు . ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తన ఇద్దరు కుమార్తెలు భీతిల్లిపోయి విషయాన్ని ఇంటి యజమానులకు తెలిపారు. దీంతో ఏడుకొండలు తన కుమారుడిని బైక్పై ఎక్కించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న తాలుకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ డి.శ్రీనివాసరావు హత్య జరిగిన ఇంటిని పరిశీలించి అక్కడి నుంచే హత్యకు సంబంధించిన సమాచారం ఎస్పీ సత్య ఏసుబాబుకు ఫోన్ ద్వారా అందించారు. పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.