ప్రేమించడం లేదనే కోపంతో వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సనత్‌నగర్‌కు చెందిన స్రవంతికి 2013లో యాదగిరి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందు నుంచే రవి అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనతో పెళ్లికి అంగీకరించి, వేరొకరిని పెళ్లి చేసుకుందని రవి ఆరోపిస్తున్నాడు. స్రవంతిపై కోపం పెంచుకున్న అతడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు.
సోమవారం సాయంత్రం ఎర్రగడ్డ రైతుబజార్ సమీపంలో స్రవంతి కొబ్బరి బొండం తాగుతుండగా.. రవి వెనుక నుంచి వచ్చి కత్తితో ఆమె మెడపై నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిపై ఇంతకుముందే ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయినా వారు పట్టించుకోలేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.