పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకేచోట కలిస్తే ఇక అది ఎలా ఉంటుందో తెలిసిందే. రాం చరణ్ పెళ్లినాడు కలిసిన ఈ ఇద్దరు మళ్లీ ఇప్పుడు కలిసి సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్‌పై పవన్ కళ్యాణ్ తొలి క్లాప్ కొట్టారు. సినిమా ఘనవిజయం సాధించాలని, అంతా మంచి జరగాలని పవన్ కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాతలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారుడు అభయ్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభంకానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమాను మొదలుపెడతారు. కాగా, ఎన్టీర్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నిర్మాణ సంస్థ హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ అభిమానులకు అందించింది. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులు యంగ్ టైగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవర్ టైగర్’ అంటూ వీరి కాంబినేషన్‌కు పేరుపెట్టారు. ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ రావడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.