విశాఖ నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి పైశాచికంగా ప్రవర్తించాడు. వాహనదారుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ రైల్వేన్యూకాలనీకి చెందిన గంజి శివ(23) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను ఫూటుగా మద్యం తాగాడు. రైల్వేన్యూకాలనీ శ్రీనివాస కల్యాణమండపం ప్రాంతంలో భిక్షాటన చేసుకునే ఓ మహిళ ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడి ఉంది. పక్కనే రహదారిపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవేమి పట్టని శివ ఆమెపై అత్యాచారం చేశాడు. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు అతన్ని నిలువరించడం మానేసి, వీడియో తీసి చరవాణి ద్వారా పోలీసులకు పంపించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శివ పాత నేరస్థుడని, చిన్నతనం నుంచే మద్యానికి బానిసై పలు నేరాలకు పాల్పడ్డాడని వారు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
