తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే .
రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే నేను అంటున్నారు ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,ప్రస్తుత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ .ఇటీవల రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు .
ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ “తనకు కానీ ,మంత్రి పరిటాల సునీత కుటుంబానికి కానీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఎలాంటి కంపెనీలు లేవు .నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కాంట్రాక్టులు ఇవ్వలేదు .ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ప్రభుత్వం నుండి సమస్యలు వస్తాయి అని తెల్సి కూడా నేను రేవంత్ రెడ్డికి బెయిల్ ఇప్పించాను అని ఆయన అన్నారు .