తమిళ ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం మెర్సల్ సినిమా రేపిన దుమారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనులు సృష్టిస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఈ చిత్రంలో డైలాగులు ఉండడంతో.. కాషాయం బ్యాచ్ ఒక్కొకరుగా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్.. విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. తిరుచ్చి జిల్లా మలైకోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెర్సల్ చిత్రంలో కేంద్రంపై తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లో చేరే విధంగా పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇక విజయ్‌తో తమకు ఎలాంటి విభేధాలు లేవని, భవిష్యత్తులో ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలుపరచిన పలు పథకాలకు విజయ్ మద్దతు తెలిపారని గుర్తుచేశారు. అంతే కాకుండా జోసఫ్ విజయ్ అనే పేరును మార్చుకొని ఆయన ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన భార్య మతమార్పిడికి పాల్పడ్డారా.. లేదా అన్న విషయం నిజమో.. కాదో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై వెల్లువెత్తుతున్న అనుమానాలను విజయ్ నివృత్తి చేస్తే, ఆయనను తాము బహిరంగ క్షమాపణలు కోరతామన్నారు. సినిమాలు లేక పలువురు హీరోలు కేంద్రాన్ని విమర్శిస్తూ పేరును సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.