ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్తగా ఏం చెప్పకుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని తేలిపోయింది. జగన్ పిటిషన్ పై శుక్రవారమే విచారణ ముగిసినా ఈరోజు తీర్పును సీబీఐ కోర్టు ప్రకటించింది. దీనికిప్రత్యామ్నాయ మార్గాలను వైసీపీ నేతలు అన్వేషించే పనిలో పడ్డారు.
దీంతో జగన్ పాదయాత్ర ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. వారం వారం పాదయాత్రకు బ్రేక్ వేసి కోర్టుకు హాజరైతే జగన్ తరపు లాయర్ వాదించినట్లు సీరియస్ నెస్ పోవటంతో పాటు..రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి జగన్ ఇప్పుడు పై కోర్టులను ఆశ్రయిస్తారా..? లేక వారం వారం కోర్టుకు వచ్చి వెళతారో అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇఫ్పటికే పాదయాత్రను ఓ సారి వాయిదా వేసినందున వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. తర్వాత పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.