ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏ ఆటంకాలు లేకుండా సాగేనా.. లేక బ్రేకులు తప్పవా.. అనే విషయం ఈ సోమవారం తేలనుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల ప్రతి వారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. జగన్ వేసిన పిటిషన్ పై వాదనలు ముగియగా.. నేడు తీర్పు వెలువడనుంది. దీని కోసం వైసీపీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
ఇక గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ.., ఆ తరువాత విదేశీ పర్యటనల సమయంలోనూ జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. ఇక ఈ దఫా కూడా మినహాయింపు లభించవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జగన్ కు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ చేసిన వాదనల్లో పెద్దగా పస లేదని వారు అంటున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే హక్కు జగన్‌కు లేదని వాదించడం మినహా, వద్దని చెప్పడానికి సరైన కారణాలను సీబీఐ న్యాయవాదులు కోర్టు ముందు ఉంచలేకపోయారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక అన్నిజిల్లాల్లో వైసీపీ శ్రేణులు కూడా జగన్ రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. సీబీఐ కోర్టు జగన్ పాదయాత్ర విషయంలో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందా.. లేదా అనేది మరికొద్దిసేపట్లో తెలిసిపోతుంది.