తెలంగాణ రాష్ట్రమంతా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో చేరుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామ పంచాయతిలోని శాంతినగరం, మామిడిగూడెం గ్రామాల్లోని సుమారు 500 మంది సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో చేరారు. వారందరిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో ఎమ్మెల్యే కనకయ్య టిఆర్‌ఎస్ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన వందమంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వారు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెప్పారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు మురుకురి చంద్రయ్యతో పాటు పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు గులాబీ దళంలో చేరారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారిని పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.