ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను ఆకర్షించి, తర్వాత వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ముఠా 500 మంది అమ్మాయిలను ఢిల్లీ, ఆగ్రాలోని వేశ్యా గృహాలకు అమ్మేసినట్లు పోలీసుల తెలియజేశారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన దంపతులను ఢిల్లీలోని గీతా కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని వేశ్యా వాటిక నుంచి 19 ఏళ్ల అమ్మాయి రక్షించిన పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేసి, వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. పింకీ, రాధీలు ఎలా అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నది తెలుసుకున్నారు. వీరి బాధితుల్లో పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన యువతులే అధికంగా ఉన్నారు.
పింకీ ముఠా సభ్యులు మొబైల్ దుకాణాల నుంచి అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించి, వారికి ఉద్యోగాలు పేరుతో వలవేస్తారు. తర్వాత వారిని మభ్యపెట్టి తమ దగ్గరకు రప్పించి వేశ్య గృహాలకు అమ్మేయడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం లాంటి కార్యకలాపాలకు పాల్పడతారు. ఇటీవల ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో దాడులు నిర్వహించిన పోలీసులకు పింకీ ఫోన్ నెంబరు లభ్యమైంది. దీంతో ఆమెపై నిఘా ఉంచిన పోలీసులకు అసలు గుట్టు తెలియడంతో పింకీ, ఆమె భర్తను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే పిల్లలు వీరికి దూరంగా ఉంటున్నారు.